Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నారా?.. మీ బ్రెయిన్ పనితీరు మందగిస్తున్నట్లే!

Short Videos Impact on Brain Function Study
Advertisement
  • షార్ట్ వీడియోల వ్యసనంతో ఏకాగ్రత, స్వీయ నియంత్రణ తగ్గుతున్నాయని పరిశోధన
  • అధికంగా వీడియోలు చూసేవారిలో మెదడు పనితీరు మందగించినట్లు గుర్తింపు
  • తక్షణ ఆనందానికి మెదడు అలవాటుపడటమే ఈ వ్యసనానికి ప్రధాన కారణం
  • డిజిటల్ బ్రేక్స్, వ్యాయామం వంటి వాటితో ఈ ప్రభావం నుంచి బయటపడొచ్చంటున్న నిపుణులు
Advertisement
ఒక వీడియో చూద్దామని ఫోన్ పట్టుకుంటే చాలు.. గంటలు గడిచిపోవడమే తెలియదు. ఒకదాని తర్వాత మరొకటి చూస్తూ స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం. మన దైనందిన జీవితంలో అంతగా భాగమైపోయిన ఈ షార్ట్ వీడియోలు కేవలం మన సమయాన్ని మాత్రమే కాదు, మన మెదడు పనితీరును కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తాజా పరిశోధన ఒకటి హెచ్చరిస్తోంది. ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, సమాచారాన్ని గ్రహించే శక్తిపై ఈ అలవాటు ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేస్తోంది.

మెదడు లోపల ఏం జరుగుతోంది?
షార్ట్ వీడియోలను ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవారిలో మెదడు పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పరిశోధకులు ఈఈజీ (EEG) స్కాన్‌లను ఉపయోగించారు. "ఫ్రాంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్" జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం షార్ట్ వీడియోలకు బానిసలైన వారిలో మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగంలో పనితీరు మందగించినట్లు గుర్తించారు. నిర్ణయాలు తీసుకోవడం, ఏకాగ్రతను నిలపడం, మనల్ని మనం నియంత్రించుకోవడం వంటి కీలక పనులను ఈ భాగమే నిర్వర్తిస్తుంది. వీడియోలు ఎక్కువగా చూసేవారిలో ఈ ప్రాంతం తక్కువ చురుగ్గా ఉండటం వల్ల వారిలో ఏకాగ్రత లోపించడం, పరధ్యానాన్ని అడ్డుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు తేల్చారు.

ఎందుకింత వ్యసనంగా మారుతోంది?
నిడివి ఎక్కువగా ఉండే కంటెంట్‌తో పోలిస్తే, షార్ట్ వీడియోలకు పెద్దగా మానసిక శ్రమ అవసరం లేదు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే నవ్వో, ఆశ్చర్యమో, కొత్త ఆలోచనో అందించి మెదడుకు తక్షణ ఆనందాన్ని (Instant Gratification) ఇస్తాయి. నిరంతరం ఇలాంటి తక్షణ ఫలితాలకు మెదడు అలవాటుపడటం వల్ల, ఎక్కువ సమయం ఏకాగ్రత అవసరమయ్యే పనులపై దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. ఇది ఇతర ప్రవర్తనా వ్యసనాల మాదిరిగానే పనిచేస్తుందని, తేలికైన ఆనందం కోసం మెదడు వెంపర్లాడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

ప్రభావం ఏకాగ్రతపైనే కాదు..
ఈ అధ్యయనంలో షార్ట్ వీడియోల అధిక వినియోగానికి, స్వీయ నియంత్రణ లోపించడానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు కూడా కనుగొన్నారు. ఈ అలవాటు రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. పనులను వాయిదా వేయడం, ఇతరులతో సంభాషణల్లో శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, సామాజికంగా ఒంటరితనానికి, వాస్తవ ప్రపంచంతో సంబంధాలు తగ్గించుకోవడానికి కారణమవుతోందని గత అధ్యయనాలు సైతం వెల్లడించాయి.

అయితే, ఈ ప్రభావం నుంచి బయటపడటం సాధ్యమేనని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. యాప్స్‌కు సమయ పరిమితులు పెట్టుకోవడం, నిద్రపోయే ముందు డిజిటల్ బ్రేక్స్ తీసుకోవడం, ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం లేదా వ్యాయామం వంటి వాటిపై దృష్టి పెట్టడం ద్వారా మెదడును తిరిగి గాడిలో పెట్టవచ్చని సూచిస్తున్నారు. వినోదం కోసం చూసినంత వరకు ఫర్వాలేదు కానీ, స్క్రోలింగ్ అనేది ఒక అసంకల్పిత అలవాటుగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Advertisement
Short Videos
Brain Function
EEG Scan
Instant Gratification
Attention Span
Digital Addiction
Mental Health
Scrolling Addiction

More Telugu News